తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం గ్యారంటీల్లో మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు ప్రారంభించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇదే పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇవాళ అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచిన రేవంత్ సర్కార్ తాజాగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ స్కీమ్‌ను ప్రారంభించింది.
అయితే మొదట ఈ రెండు పథకాలను రంగారెడ్డి చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రారంభించాలనుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో సోమవారం రాత్రి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వేదికను సచివాలయానికి మార్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.