మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు కూడా తమ కార్యాచరణను ఇప్పటికే షురూ చేశాయి. ముఖ్యంగా మరోసారి అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉంది కమలదళం. ఈ నేపథ్యంలోనే మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంపై కసరత్తును ముమ్మరం చేసింది.
త్వరలోనే తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలోని కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల్లో టికెట్ ఆశావహుల వడపోతపై పార్టీ అధిష్ఠానం బుధవారం మంతనాలు జరిపింది. మధ్యప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వేర్వేరుగా చర్చించగా.. ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నేతలతో ఇప్పటికే ఇలాంటి భేటీలు ముగిశాయి. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవని అనేక స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.