ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను భారత్ నొక్కి చెప్పింది. అలా జరగకపోతే ఆ సంస్థ విస్మరణకు గురవుతుందని హెచ్చరించింది. 2000 సంవత్సరంలో జరిగిన మిలినియం సమ్మిట్‌లోనే సంస్కరణలను ప్రతిపాదించారని తెలిపింది. ఐక్య రాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ.. దాదాపు 25 ఏళ్లుగా ఈ అంశంపై చర్చలు కొనసాగడంపై అసహనం వ్యక్తం చేశారు.
భద్రతా మండలి సంస్కరణల విషయంలో రాబోవు తరాలు ఇక ఏ మాత్రం ఓపిక పట్టలేవని కాంబోజ్ పేర్కొన్నారు. వెంటనే సంస్కరణల దిశగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఆఫ్రికా వంటి చరిత్రాత్మకంగా అన్యాయానికి గురైన ప్రాంతాలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. సంస్కరణల పథంలో అర్హత కలిగిన గ్రూపులు, దేశాలను గుర్తించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంబోజ్ సూచించారు. భారత ప్రతిపాదనలకు బ్రెజిల్, జర్మనీ, జపాన్ మద్దతు తెలిపాయి. 193 సభ్యదేశాల వైవిధ్యత ప్రతిబింబించేలా ఐరాస భద్రతా మండలి కూర్పు ఉండాలని నొక్కి చెప్పాయి.