అమెరికా అధ్యక్ష బరిలో మళ్లీ ఆ ఇద్దరే అభ్యర్థులుగా ఖరారయ్యారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున జో బైడెన్ నామినేషన్ ఖరారవ్వగా.. కేవలం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో బైడెన్ గెలుపొంది.. పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా ఐలాండ్స్‌లోనూ ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు వాషింగ్టన్‌లో ట్రంప్ విజయం సాధించడంతో నామినేషన్‌కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు ఆయనకు లభించింది. ఈరోజు వెలువడనున్న మరికొన్ని ప్రైమరీల్లోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. చివరి వరకు పోటీగా నిలిచిన నిక్కీ హేలీ రేసు నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు.
ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల ముందు ఉందని అన్నారు. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? అంటూ ప్రశ్నించారు.