చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో, అభివృద్ధి పేరుతో ఆక్రమణలు పెరిగి చెరువుల్లో నిర్మాణాలు వెలుస్తుండటం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమేనని లేఖలో పేర్కొన్నారు ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రస్తుత ఆర్థికాభివృద్ధి తీరు, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయని జస్టిస్ వేణుగోపాల్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల, నదీ పరీవాహక ప్రాంతాల ఆక్రమణలవల్లనే హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. చట్టవిరుద్ధంగా నీటి వనరుల్లో సాగుతున్న ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది, అని ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది.