సార్వత్రిక ఎన్నికలు మొదటి దశ పోలింగ్ శుక్రవారం రోజున ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 102 స్థానాలకు పోలింగ్ జరగగా.. బంగాల్, మణిపుర్‌లో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇక తొలిదశలో 62.37 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే నాగాలాండ్లో మాత్రం దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెనుదిరగాల్సి వచ్చింది.
ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తూ నాగా తెగ ప్రజలు 2010 నుంచి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఏడు గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO)గా ఏర్పడి ఎన్నోఏళ్లుగా తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్ పాటించాలని ENPO ప్రకటించడంతో పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు, అత్యవసర సేవలు మినహా రోడ్లపై ఏ ఒక్క వ్యక్తి, వాహనం కనిపించలేదు.