కెన్యాలో భారీ వరదలతో డ్యామ్ కప్పుకూలింది. ఈ ఘటనలో దాదాపు 45 మంది మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వరద ఉద్ధృతికి పశ్చిమ కెన్యా, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రదేశంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ సోమవారం ఉదయం కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా ఆకస్మిక వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
మరోవైపు కెన్యాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదల వల్ల ఇప్పటికే వందమందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వరదల కారణంగా 2 లక్షల మంది ప్రజలు స్థానిక పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. వర్షాలు మరికొన్ని రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాఠశాలలకు ఇచ్చిన మధ్యంతర సెలవుల్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. టాంజానియాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి ఆ దేశంలో ఇప్పటికే 155 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.