నాగర్ కర్నూల్ జిల్లా మైలారం గ్రామస్థులు లోకసభ ఎన్నికలను బహిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రామంలో ఉన్న గుట్టపై మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌తో ర్యాలీ చేపట్టిన వారు.. మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ పలుమార్లు తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నించగా గతంలో అడ్డుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు తమకు అనుమతులు వచ్చాయని తవ్వకానికి సిద్ధమవుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే తాము లోకసభ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా బహిష్కరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. గుట్టపై పురాతన ఆలయాలు, వన్య ప్రాణాలు సహా గొర్రెల గ్రాసానికి గుట్టే ఆధారమని గ్రామస్థులు చెబుతున్నారు. గుట్టపై ఉన్న చెట్లు నాశనమై పర్యావరణానికి హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పక్కనే ఊరు చెరువు ఉందని దానిపై ఆధారపడి వేలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని లేదంటే తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.