మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వేటు వేసేందుకు జేడీఎస్ రంగం సిద్ధం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ వెల్లడించారు. ఈరోజు జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు.
ఆయన ఎంపీ అయినందున.. నిర్ణయం పైస్థాయిలో తీసుకోవాలన్న కుమారస్వామి జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడకు ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తోందని.. ఆయనపై అభియోగాలు నిజమైతే చట్టప్రకారం శిక్ష తప్పదని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలను ప్రస్తావించిన ఆయన.. బీజేపీకి, ప్రధాని మోదీకి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మండ్య, హస్సన్, కోలార్ స్థానాలు జేడీఎస్‌కు దక్కగా.. 2019లో హాస్సన్లో గెలుపొందిన ప్రజ్వల్ ఈసారి మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేశారు. ఈ స్థానానికి రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగాయి.