లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మరోసారి స్పందించారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రజ్వల్‌ను హెచ్చరిస్తూ ఎక్స్(ట్విట్టర్) లో సుదీర్ఘ లేఖ పోస్టు చేశారు.
కొన్ని వారాలుగా ప్రజలు తనపై, తన కుటుంబంపైనా కఠిన పదాలు వాడుతున్న విషయం తెలుసునని ,వాస్తవాలు బయటకు వచ్చేవరకు వాటిని ఆపాలని వారికి చెప్పడం ఇష్టం లేదన్నారు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలు తనవెంటే ఉన్నారన్న ఆయన.. వారికి ఎంతో రుణపడి ఉన్నానని వెల్లడించారు. వారి విశ్వాసాన్ని తిరిగి పొందడమే తనకు ముఖ్యమని ఆయన వెల్లడించారు. అంతకుముందు ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందిస్తూ.. తాతపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ,అశ్లీల వీడియోల కేసు అందరినీ తల దించుకునేలా చేసిందని, ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.