సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓడారు. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 1985 నుంచి వరుసగా 8 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-2019 వరకు సిక్కిం సీఎంగా పవన్ కుమార్ పనిచేశారు.
పోక్లోక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం క్రాంతికారి మోర్చా అభ్యర్థి భోజ్ రాజ్ రాయ్ చేతిలో ఓటమి పొందారు.భోజ్ రాయ్‌కి 8,037 ఓట్లు పోలవ్వగా, చామ్లింగ్‌కు 4,974 ఓట్లు వచ్చాయి. అంటే 3,063 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.