మృగశిర కార్తెని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, యూపీ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్థులకు తరలొస్తారు. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎగ్జిబిషన్ మైదానం అజంతా గేటు నుంచి లోపలికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యలో నుంచి చేప ప్రసాదం కోసం వరుసలో వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించారు. ముందుగా టోకెన్లు తీసుకోవాలని.. చేప ప్రసాదం పంపిణీకి మొత్తం 32 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి రానున్న నేపథ్యంలో 1200 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.