రాష్ట్రంలో గత నెల 27వ తేదీన జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు గురువారం రాత్రికి పూర్తి కాగా.. గెలుపు కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతానికంటే ఒక ఓటు ఎక్కువ)గా పరిగణించే 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో విజేతను నిర్ణయించడానికి అధికారులు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. గెలుపు కోసం తీన్మార్ మల్లన్నకు 32,282 ఓట్లు, రాకేశ్‌రెడ్డికి 50,847 ఓట్లు రావాలి. ఎలిమినేషన్ క్రతువు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 ఇన్‌వ్యాలిడ్ ఓట్లు నమోదయ్యాయి.