నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ఎమ్మెల్యేల సహకారంతో, రాష్ట్ర ప్రజల తీర్పుతో మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశం తనకు లభించిందని అన్నారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ సర్కార్ నేతృత్వంలో తనకు జరిగిన విషయాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
“పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరిచిపోలేను. నేను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశాం. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేసినందునే గెలుపు సాధ్యమైంది. గత ప్రభుత్వంలో ఎన్నో ఘోరాలు జరిగాయి. జగన్ ఎన్నో తప్పులు చేశారు. అప్పుడు తప్పు చేసిన వారెవరినీ వదిలేది లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు.” అని చంద్రబాబు అన్నారు.