ఏపీలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని తెలిపారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లామని చెప్పారు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయన్న చంద్రబాబు.. రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఏపీ సంక్షోభంలో ఉందని.. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని .. రైతులు అప్పులపాలయ్యారని వాపోయారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఇక ఏపీలో ఉండదన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని చంద్రబాబు వెల్లడించారు.