కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ఛానళ్లను అడ్డుపెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్‌కు బదులు టీజీగా మార్చినందుకు వేల కోట్ల ఖర్చు అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్దమా? అని వెంకట్ సవాల్ విసిరారు. ఒకవేళ వారు చేస్తున్న ఆరోపణలు నిజం అని తేలితే బహిరంగంగా క్షమాపణ చెబుతామని అన్నారు.
లేకపోతే అక్కడే కేటీఆర్ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తప్పుడు ప్రచారాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నేతలు వాస్తవాలు ప్రజలకు చెప్పాలని హితవు పలికారు. ప్రభుత్వంలో తప్పులు కనిపిస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డే లక్ష్యంగా, ఆయన మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన వచ్చిందని.. దీనిని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.