ఉత్తరాదిన పలు రాష్ట్రాలను వరద వణికిస్తోంది. కుండపోతతో రహదారులు, ఇండ్లు జలమయమవుతున్నాయి. బిహార్‌లో పిడుగుపాటుకు గడిచిన 24 గంటల్లో 12 మంది మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు బిహార్ సీఎం కార్యాలయం సోమవారం వెల్లడించింది.
భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరద నీరు పోటెత్తింది. సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నామని అధికార యంత్రాంగం పేర్కొంది. మరోవైపు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కుండపోతతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి. అటు అసోం, ఉత్తరాఖండ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో భారీ వానలతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడుండటంతో వాహనాల రాకపోకలు నిలిచి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అసోంలో గత కొద్దిరోజులుగా వరద ఉధృతి 24 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. బ్రహ్మపుత్ర నది పోటెత్తడంతో పాటు రాష్ట్రంలో పలు ప్రధాన నదులకు వరద నీరు పోటెత్తింది.