ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతుంది అందరూ భక్తిపూర్వకంగా దీపాలు వెలిగిస్తున్నారు. భక్తితో ముడిపడిన మన సంప్రదాయాలలో ప్రతీ ఆచారానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం,గుడిలో ఉసిరి దీపం వెలిగించటం వెనుక దాగి ఉన్న పురాణ నేపథ్యం ఏమిటి? కేవలం ఆరాధన మాత్రమేనా, లేక దాని వెనుక మన ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప శాస్త్రీయ కారణం కూడా ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం..
శివకేశవుల అనుగ్రహం: కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. ఉసిరి చెట్టును సాక్షాత్తు శివస్వరూపంగా అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగించడం, లేదా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని, సమస్త దరిద్రాలు దూరమవుతాయని విశ్వసిస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, మన మనస్సుకు ప్రశాంతతను, ధైర్యాన్ని ఇచ్చే ఒక బలమైన నమ్మకం.

ఆరోగ్యాన్నిచ్చే ఆయుర్వేద సంజీవని: కార్తీక మాసం చలికాలం ప్రారంభమయ్యే సమయం. ఈ కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కఫ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఉసిరి (ఆమ్ల) గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందంటే, ఇది విటమిన్ ‘C’తో నిండిన గొప్ప ఔషధం. ఇది మన ఆరోగ్యానికి సంజీవని లాంటిది.
ఉసిరి చెట్టు కింద గడపడం, దీపాలు వెలిగించడం ద్వారా ఆ చల్లని గాలిని పీల్చడం, అలాగే వనభోజనాల వంటి కార్యక్రమాల ద్వారా ఉసిరిని ఆహారంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దీపం యొక్క ఉష్ణోగ్రత, ఉసిరి నుంచి వచ్చే ఔషధ గుణాలు కలగలిసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మన పెద్దలు భక్తి రూపంలో మనకు ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన మార్గాన్ని ఏర్పరిచారు.
ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం అనేది కేవలం ఆచారం కాదు. అది భక్తి, ఆరోగ్యం, శాస్త్రం, పర్యావరణ పరిరక్షణ అనే నాలుగు అంశాల అద్భుతమైన సమ్మేళనం. మన సంస్కృతిలో దైవత్వం, ప్రకృతికి ముడిపడి ఉన్న గొప్ప జీవన విధానానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.
