రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. లక్ష జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ కాదని, అలాంటి వారివి 17 వేల ఖాతాలున్నాయని తెలిపారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు. ఈనెల 18న రూ. లక్షలోపు రుణాలు, ఆగస్టు 15లోగా మిగతా రూ. లక్ష రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కాగా, ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గురువారం (జులై 18వ తేదీ) న తొలి విడతగా లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం 8వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమి పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబం 2 లక్షల మాఫీకి అర్హులేనని తెలిపారు. రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.