నీట్ పరీక్షా పత్రంలో చర్చనీయాంశమైన ఫిజిక్స్ ప్రశ్నపై సరైన సమాధానం కోసం ఐఐటీ-ఢిల్లీ డైరెక్టర్‌కు సుప్రీంకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేస్ మార్కులకు దారితీసిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు దానిపై సమాధానం సమర్పించాలని సీజేఐ డైవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మంగళవారం కూడా విచారణ కొనసాగనుంది.
నీట్ పరీక్షా పత్రం, లీకేజీ అవకతవలపై సోమవారం సుప్రీంకోర్టులో తిరిగి విచారణ జరిగింది. గ్రేస్ మార్కులకు దారితీసిన ఫిజిక్స్ ప్రశ్న అంశాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చి, మార్కులు మాత్రం ఒకదానికే వేశారని, దానికి గ్రేస్ మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా మెరిట్ లిస్ట్ మారే అవకాశం ఉందని పిటిషనర్లు తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం వెంటనే స్పందిస్తూ, సరైన సమాధానం కోసం ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి ఆ సమాధానం తమకు సమర్పించాలని ఢిల్లీ-ఐఐటీ డైరెక్టర్‌ను ఈ మేరకు ఆదేశించింది.