కుక్కల రక్షణ కంటే మనుషుల రక్షణే అవసరమని గుర్తించి భయంకరంగా వీధుల్లో తిరుగుతున్న వీధికుక్కలను చంపేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కి సోమవారం లేఖ రాశారు.రాష్ట్రంలో వీధి కుక్కల బెడద పెరిగిందనీ జీహెచ్ఎంసీ సర్వే ప్రకారం కేవలం ఒక హైదరాబాదులోనే సుమారు 4 లక్షల శునకాలు ఉన్నాయని తెలిపారు. పసిపిల్లలను వీధి కుక్కలు వెంబడించి తీవ్రంగా గాయపరచడం, కొన్ని సందర్భాలలో శరీర భాగాలను తినడం టీవీలలో చూసినప్పుడు హృదయం కలచివేస్తుందనీ అన్నారు.
జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్ 249 ప్రకారం యాజమానులు లేని వీధి కుక్కలను చంపి వేయవచ్చు అని,జీహెచ్ ఎంసీలో భారత ఏనిమల్ వెల్ఫేర్ బోర్డు సలహాలు పాటించడానికి సరైన యంత్రాంగం లేనందున ఆ బోర్డు సలహాలు కాగితాలకే పరిమితమైందనీ పేర్కొన్నారు.మనుషులను కుక్కల బారినుంచి కాపాడుట కూడ ముఖ్యమైనదేనని, పాలన యంత్రాంగం అలసత్వం వలన ప్రజలు కుక్కల కాటుతో ఎవరూ బాధపడకూడదు’ అని వీధి కుక్కలను చంపేందుకు జీహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు.