పారిస్ ఒలింపిక్స్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం (జులై 27)న జరిగిన తొలి పోరులో పురుషుల హాకీ టీమ్ ఘన విజయం సాధించింది. 3-2తో న్యూజిలాండ్‌పై గెలుపొందింది. టీమిండియాలో వివేక్ సాగర్, హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ గోల్స్ చేయగా, న్యూజిలాండ్ జట్టులో సైమన్ చైల్డ్, సామ్‌లేన్ తమ జట్లకు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆఖరి నిమిషంలో దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్‌గా మలిచి జట్టును విజయతీరాల వైపునకు నడిపించాడు.
మ్యాచ్ ప్రారంభంలో న్యూజిలాండ్ జట్టు దూకుడుగా ఆడటంతో భారత్ గెలుపు అందని ద్రాక్షేనని అంతా అనుకున్నారు. కానీ రెండో క్వార్టర్‌లోని 24వ నిమిషంలో దక్కిన పెనాల్టీని మన్‌దీప్ సింగ్ గోల్‌గా మలిచి స్కోర్ను సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో మొదటి క్వార్టర్ను 1-1తో ముగించారు. వివేక్ సాగర్ కొట్టిన గోల్తో 2-1 స్కోర్తో భారత్ మూడో క్వార్టర్లో ఆధిక్యం పొందగా.. 2-1 ఆధిక్యంతో మూడో క్వార్టర్ పూర్తైంది. ఆ తర్వాత ఉత్కంఠగా సాగిన ఆఖరి నిమిషంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కొట్టిన గోల్ వల్ల భారత్ ఈ మ్యాచ్లో విజయతీరాలకు చేరుకుంది. భారత్ సోమవారం (జులై 29)న అర్జెంటీనాతో తలపడనుంది.