అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ప్రచారం ముమ్మరం చేశారు. అయితే డెమోక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ తప్పుకుని ప్రచారంలోకి కమలా హ్యారిస్ పేరు వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి విరాళాలు భారీగా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత విరాళాలు మరింత ఎక్కువగా వస్తున్నాయి.
ఈ క్రమంలోనే కమలా హారిస్‌కు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ భారీ విరాళం అందించారు. ఏకంగా రూ.58.6 కోట్లు (7 మిలియన్ల డాలర్లు) ఇచ్చినట్లు తెలిసింది. ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి ఇప్పటివరకూ హేస్టింగ్స్ ఇచ్చిన పెద్ద మొత్తం ఇదే కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ‘నిరాశకు గురి చేసిన బైడెన్ డిబేట్ తర్వాత మేం మళ్లీ గేమ్‌లోకి వచ్చాం’ అని హారిస్‌ను ఉద్దేశించి హేస్టింగ్స్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే దీనిని ట్రంప్ మద్దతుదారులు జీర్ణించుకోలేక ‘నెట్‌ఫ్లిక్స్’ను బహిష్కరించాలంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు.