తెలంగాణ శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై చర్చ సోమవారం రోజున వాడివేడిగా సాగింది. దాదాపు 14 గంటలకు పైగా ఈ చర్చ కొనసాగింది. మవారం ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ అర్ధరాత్రి దాటాక 1.30 తర్వాత కూడా జరిగింది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల అంశం, వ్యవసాయ మోటార్లకు మీటర్లపై ఘాటుగా చర్చించారు.
పదేళ్ల పాలనలో అదనపు విద్యుదుత్పత్తిని చేపట్టని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై అప్పులభారం మోపిందని ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం హయాంలో విద్యుదుత్పత్తి, సరఫరా మెరుగుపడ్డాయని తెలిపారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పేరిట ఏటా 30,000 కోట్ల భారాన్ని అప్పటి ప్రభుత్వం మోపిందన్నారు. అర్హులైన వారందరికీ గృహజ్యోతిని అమలు చేస్తామన్నారు. బ్రాహ్మణ పరిషత్తుకు తగినన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు.. అర్హత నిష్పత్తిని 1:100 చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని భట్టి పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్ సమయంలోనే అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్దేశించినందున, ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురై, పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో తాము నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం మళ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.