హరీష్ రావు వ్యాఖ్యలను పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నారు – బీఆర్ఎస్ నేత

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యం అయ్యాయని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచార కేసులు, 2600 హత్యలు, 230 స్మగ్ల్డ్ వెపన్స్ సీజ్ చేశారని అన్నారు. నాటుతుపాకులు తెలంగాణకు ఎలా వస్తున్నాయని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని అన్నారు హరీష్ రావు.

దీంతో హరీష్ రావు వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. నేడు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు వ్యాఖ్యలను పోలీసు అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. పోలీసు అధికారుల పట్ల మాకు గౌరవం ఉందన్నారు దేవి ప్రసాద్.

పోలీసు అధికారులు కొంతమంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని హరీష్ రావు అన్నారని వివరించారు. మాజీ సీఎం కేసీఆర్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీసు డిపార్ట్మెంట్ లో అనేక సంస్కరణలు చేశారని అన్నారు. పోలీస్ స్టేషన్లకు స్టేషనరీ ఖర్చులు, పోలీసులకు కొత్త ఇన్నోవాలు ఇచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. 47 వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్ నియామకం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు దేవీ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news