ముంబైలోని చెంబూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అందరూ సజీవదహనం అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు విచారణలో భాగంగా తేల్చారు. దేవీ నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన దీపం వల్లే కుటుంబంలోని ఏడుగురు మరణించారని పోలీసులు నిర్దారించారు. పోలీసుల కథనం ప్రకారం.. చెంబూరులోని సిద్ధార్థ్ కాలనీలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు సమాచారం అందించారు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇంట్లో పెట్టిన దీపం వల్లే మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. దుర్గా నవరాత్రి సందర్భంగా తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్‌లోని కిరాణా షాప్‌లో పూజ అనంతరం దీపం వెలిగించారు. ఆ దీపం మంటలే వస్తువులకు అంటుకున్నాయి. ఈ క్రమంలోనే షాప్‌లో నిల్వ ఉంచిన కిరోసిన్‌కు మంటలు అంటుకొవడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో మొదటి, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నవారు నిద్రలోనే సజీవదహనం అయినట్లు అధికారులు విచారణలో గుర్తించారు.