అన్ని నెలల్లో కల్లా కార్తీక మాసం ప్రత్యేకమైనది. కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. తెలుగు సంవత్సరాల్లో వచ్చే ఎనిమిదవ మాసం ఇది. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండడం వలన కార్తీక మాసం అనే పేరు వచ్చింది. పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన నెల ఇది. ఈ నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు చేస్తే శివుడు అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం కార్తీకమాసం నవంబర్ 2 నుంచి మొదలవుతుంది. అత్యంత మహిమాన్విత మాసం ఇది. ఉపవాసాలు, వనభోజనాలు, పూజలు, వ్రతాలు ఇలా ఎన్నో కార్తీకమాసంలో చేస్తారు.
కార్తీక మాసంలో ఏ శివాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. బిల్వార్చన, రుద్రాభిషేకాలు ఇలా శివుని అనుగ్రహం కోసం భక్తులు పరితపిస్తారు. అయ్యప్ప దీక్షలు కూడా ఈ నెలలోనే మొదలవుతాయి. శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది.
పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలని వెలిగిస్తారు. వాటిని పారే నీటిలో లేదా చెరువులో విడిచిపెడతారు. శివాలయానికి వెళ్లి పూజలు చేసిన వాళ్లకి దోషాలు తొలగిపోతాయి. ఈతి బాధలు కూడా ఉండవు. ప్రదోషకాలంలో చేసే శివారాధనకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో చేసే దీపారాధనకి ఎంతో మహిమ ఉంటుంది. సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్లి దీపారాధన చేస్తారు. ఇలా చేస్తే జన్మజన్మ పాపాలు తొలగిపోతాయి. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం చాలా మంచిది ఉసిరి చెట్టు కింద దీపాలను కూడా వెలిగించడం మంచిది.