రాష్ట్రంలోని రైతులు సంప్రదాయ పంటలైన పత్తి, మిర్చి కాకుండా పామాయిల్ పంటను సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో మంత్రి తుమ్మల.. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పత్తి పంట దిగుబడి తగ్గిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసినా దిగుబడి తగ్గడానికి కారణం అదే అని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. అదేవిధంగా రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతుల్ని మోసం చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని.. పత్తి,మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలొస్తాయని చెప్పారు.