ఓటర్ చైతన్యంలో ఉత్తమ ప్రచారానికి మీడియా-2024కి ఎంట్రీలకు ఆహ్వానం

-

ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ఓటర్ల చైతన్యం, అవగాహన ప్రచారంలో ఉత్తమంగా కృషి చేసిన మీడియా సంస్థలకు-2024 పేరిట భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రదానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రింట్’ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,  ఆన్లైన్ మీడియా రంగాల్లో ఓటర్లలో చైతన్యం, అవగాహన పెంపొందించేందుకు ఉత్తమ కృషి చేసిన వారికి రంగానికి ఒక అవార్డు వంతున భారత ఎన్నికల సంఘం 2012 నుండి ప్రతి యేటా అవార్డులు అందిస్తోందని తెలిపారు.

2024 ఏడాదికి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 25వ తేది జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఈ అవార్డులను ప్రధానం చేయనుందని ఆయన తెలియజేశారు. అవార్డు కింద ప్రశంసా పత్రం తో పాటు జ్ఞాపిక  ప్రధానం చేయనున్నారని సీఈఓ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్దఎత్తున భాగస్వాములను చేసేందుకు వారిలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యం కలిగించడం, ఓటరుగా నమోదు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఐటీ అప్లికేషన్లు, యూనిక్, రిమోట్ పోలింగ్ కేంద్రాలు వంటి వాటిపై ప్రత్యేక కధనాలు ప్రచురణ, ప్రసారం చేయడం ద్వారా ఓటర్ల అవగాహనకు విశేష కృషి చేసిన మీడియా సంస్థలకు భారత ఎన్నికల సంఘం ఈ అవార్డులను ప్రదానం చేయనుందని సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news