యూపీలోని అన్ ఎయిడెడ్ మదర్సాలపై యోగి సర్కార్ ఫోకస్ చేసింది. 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) గురువారం విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఏటీఎస్ విచారణను ఎదుర్కొంటున్న దాదాపు 495కు పైగా అన్ ఎయిడెడ్ మదర్సాలు ఒక్క బహ్రెయిచ్ జిల్లాలోనే ఉండటం గమనార్హం. ఏటీఎస్ దర్యాప్తు లిస్టులో ఉన్న దాదాపు 100కు పైగా మదర్సాలు భారత్ – నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. వాటి వివరాలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజయ్ మిశ్రా వెల్లడించారు.
యూపీ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.రీబా ఈనెల 21న అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారులకు సంచలన ఆదేశాలతో ఒక లేఖను పంపారు. రాష్ట్రంలోని అన్ని అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై విచారణ జరపాలని అందులో ప్రస్తావించారు.విచారణను ఎదుర్కోవాల్సిన 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల వివరాలతో కూడిన లిస్టును ఏటీఎస్ డీజీపీకి అందజేశామన్నారు. ఆయా మదర్సాలకు నిధులు ఎలా సమకూరుతున్నాయనే దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి నివేదికను పంపాలని రాష్ట్రంలోని ఏటీఎస్ యూనిట్లకు ఆదేశాలు అందాయి.