భారత్ – చైనా దేశాల సరిహద్దుల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.ఇన్నాళ్లు ఇరుదేశాల ఎల్ఏసీ వద్ద ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రష్యాలో బ్రిక్స్ సమ్మిట్‌లో భాగంగా భేటీ అనంతరం ఇరుదేశాల మధ్య శాంతి నెలకొంది. సరిహద్దు వివాదాలపై చర్చలు ఫలించాయి. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు దీపావళి ఎల్ఏసీ వద్ద సంబురాలు జరుపుకున్నారు. భారతీయుల పండుగ అయిన దీపావళి సందర్భంగా గురువారం ఇరు దేశాల భద్రతా బలగాలు అప్యాయంగా ఒకరినొకరు మిఠాయిలు పంచుకున్నారు. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేలా ఎల్ఏసీ వద్ద గస్తీపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరడంతో గత నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ముగిసిపోయింది. దీంతో తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ మైదానాలలో చైనా – భారత్ మధ్య రెండు సంఘర్షణ పాయింట్ల వద్ద దళాలను ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయింది. త్వరలో ఈ పాయింట్ల వద్ద సైన్యం పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది.