పురాతన కాలం నుండి మన పెద్దలు రాగి పాత్రలో (Copper Vessel) నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతూనే ఉన్నారు. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ “కాపర్ వాటర్” ప్రతీ ఒక్కరికీ మంచి చేస్తుందా? అతిగా తీసుకుంటే ప్రమాదమేనా? కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని డాక్టర్లు ఎందుకు హెచ్చరిస్తున్నారు?మరి రాగి పాత్రలో నీరు ఎవరు తాగవచ్చు, ఎవరు తాగకూడదో మనము చూద్దాం..
ప్రయోజనాలు: రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం మరియు వాపులను తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. రాగిలో ఉండే సహజసిద్ధమైన యాంటీమైక్రోబయల్ గుణాల వల్ల నీరు శుద్ధి అవుతుంది. అయితే ఈ ఆరోగ్య రహస్యం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని చెప్పలేం.
రాగి అనేది మన శరీరానికి కొద్ది మొత్తంలో అవసరమయ్యే ఒక ట్రేస్ మినరల్. నీటి ద్వారా శరీరంలోకి చేరే రాగి పరిమాణం నియంత్రణలో ఉంటేనే ప్రయోజనం. అతిగా రాగిని తీసుకుంటే అది శరీరంలో చేరి కాలేయం మరియు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాగి నీటికి దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అనారోగ్య సమస్యలు: విల్సన్ వ్యాధి, ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మత. ఈ సమస్య ఉన్నవారికి శరీరం నుంచి అదనపు రాగిని బయటకు పంపే సామర్థ్యం లోపిస్తుంది. వీరు రాగి నీరు తాగితే, అది శరీరంలో చేరి ప్రాణాంతకం కావచ్చు. హెపాటిక్ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు లేదా ఎక్కువ రాగి నిల్వలు ఉన్నవారు కూడా రాగి పాత్రల వాడకాన్ని తగ్గించాలి.
డాక్టర్లు సూచించేది ఏమిటంటే రాగి నీటిని తాగేటప్పుడు మోతాదు పాటించడం ముఖ్యం. రోజంతా ఆ నీరు తాగకుండా ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు మాత్రమే తీసుకోవాలి. రాగి పాత్రను తరచుగా శుభ్రం చేయాలి మరియు ఎల్లప్పుడూ ఆరోగ్య నిపుణుడి సలహా మేరకు మాత్రమే దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి.
రాగి నీరు నిజంగా ఆరోగ్యానికి మేలు చేసే పానీయమే అయినప్పటికీ అది మోతాదుకు మించితే విషంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం ప్రతీ ఒక్కరికీ లభించాలంటే, రాగి నీటిని పరిమితంగా, మరియు తమ శరీర ఆరోగ్య స్థితికి అనుగుణంగా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉండటానికి సరైన సమతుల్యత ఎప్పుడూ అవసరం.