మా పార్టీ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే ఊరుకోం – టీపీసీసీ చీఫ్

-

త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని తెలంగాణ బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ దొరకడం లేదన్న మహేశ్వర్ రెడ్డి.. ఏడు నెలలుగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.

కేరళ వెళ్ళినప్పుడు కూడా ప్రియాంక గాంధీ ఆయనకు నో చెప్పారని అన్నారు. ఆమెను దూరం నుంచి చూసి వచ్చాడని ఎద్దేవా చేశారు మహేశ్వర్ రెడ్డి. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా పీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఉండగా మళ్లీ కొత్త ముఖ్యమంత్రి వస్తారని వేరే పార్టీ వారు చేసే వ్యాఖ్యలకు, ప్రచారానికి ఏం సమాధానం చెబుతామని కొట్టిపారేశారు.

సీనియర్ మంత్రులతో కూడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛగా, సజావుగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలు మహేశ్వర్ రెడ్డి కి ఏం తెలుసు..? అని ఆయన ప్రశ్నించారు. ఇక బిజెపిలో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. మా పార్టీ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు పీసీసీ చీఫ్. మాకు సీఎం ఎవరు అనేది ముఖ్యం కాదని.. ప్రజా పాలన అందించడమే మా లక్ష్యం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news