కార్తీక మాసం ప్రారంభమైన నేడు తొలి సోమవారం కావడంతో రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. దీంతో ఆలయాలన్నీ దీపకాంతులతో వెలిగిపోతుండగా.. శివయ్యను దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీలోని పంచారామ క్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగింది. అటు కోనసీమ జిల్లాలో గల ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారరామం, పశ్చిమగోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆ లయకారుడిని దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. బెజవాడ దుర్గమ్మ, మహానంది, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాలతో పాటు తెలంగాణలోని యాదాద్రి, వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా, భక్తుల తాకిడి పెరగడంతో శ్రీశైలంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.