కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రేపు ( మంగళవారం) హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన ప్రక్రియకు శ్రీకారం చుట్టుబోతోంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా బోయిన్‌పల్లిలోని గాంధీ నాలెడ్జ్ సెంటర్‌లో కులగణన పై సంప్రదింపుల సదస్సును మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచ్చేస్తున్నట్లు సమాచారం.
సాయంత్రం 5 గంటలకు ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాహుల్ ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.మరోవైపు కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నిక కోసం తన సోదరి ప్రియాంకను గెలిపించాలని అక్కడి ఓటర్లను ఆదివారం ప్రసన్నం చేసుకున్నారు. దీంతో కేవలం గంట మాత్రమే కులగణన సంప్రదింపుల సమావేశంలో రాహుల్ పాల్గొని తిరిగి వెళ్తారని తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్ పర్యటన గురించి,చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు.