హైదరాబాద్‌లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డునెంబర్-14లోని శబ్దాలయ వెనుక దివంగత సంగీత దర్శకుడు చక్రవర్తికి గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. అంతేకాకుండా అందులో నిర్మాణాలు చేపట్టి రెంట్లకు సైతం ఇచ్చారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది ఆ కట్టడాలను కూల్చివేశారు.
మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిర్మించుకునేందుకు చక్రవర్తికి 25ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం బంజారాహిల్స్ రోడ్డునెంబర్-14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో ఏడాదిలోపు స్టూడియో నిర్మించాల్సి ఉండగా..పదేళ్లు దాటినా అందులో చక్రవర్తి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.ఆయన మరణించాక తన కొడుకు శ్రీనివాస్ చక్రవర్తి కూడా స్థలాన్ని వినియోగించుకోలేదు.
శ్రీనివాస్ చక్రవర్తి కూడా మృతి చెందడంతో ఈ స్థలం విషయంలో కుటుంబంలో గొడవలు జరిగాయి. స్థలం ఖాళీగా ఉందని తెలిసిన కబ్జాదారులు కన్నేశారు. 40 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంపై నకిలీ దస్తావేజులు సృష్టించి నిర్మాణాలు చేపట్టారు.వాటికి కిరాయికి ఇచ్చి నెలకు రూ.2 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తహశీల్దార్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో వాటిని కూల్చివేశారు.ఈ స్థలం ప్రభుత్వానిదేనని ఎవరైనా నిర్మాణాలు చేపట్టనా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.