కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల లో కలెక్టర్ సహా అధికారులపై జరిగిన దాడి ఘటన బాధకరమని బీజేపీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీ.కే.అరుణ అన్నారు. ఈ ఘటన పై జిల్లా పోలీస్ ఇతర ఉన్నత అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీ వద్దంటూ గత కొద్ది రోజులుగా స్థానికులు చాలా కోపంతో ఉన్నారని.. అలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ లేకుండా అధికారులు గ్రామానికి వెళ్లారన్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు సహనం కోల్పోయి దాడులు చేసినట్టు తెలిసిందన్నారు.
అధికారులపై దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గానికే ప్రాతినిథ్యం వహిస్తున్నారని.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే వెసులు బాటు వారికి ఉందని.. అయినప్పటికీ దాడులకు దిగడం సరైంది కాదన్నారు. స్థానికంగా ఉన్న 6 గ్రామాల రైతులు ఫార్మా కంపెనీని చాలా వ్యతిరేకిస్తున్నారని ఆ గ్రామాల ప్రజల అభిప్రాయాలను గౌరవించి చర్చలకు పిలవాలని సూచించారు.