కేంద్రంలో కిషన్ రెడ్డికి మరో కీలక పదవి దక్కింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్యన సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడంలో, సమన్వయాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ (అంతరాష్ట్ర మండలి) ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛైర్మన్ గా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీకి కేంద్ర మంత్రి అమిత్ షా ఛైర్మన్ గా పునర్నిర్మించడం జరిగింది.
అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను ఈ నెల 8 వ తేదీన ప్రచురించారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థ.ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో సభ్యులుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రతిపాదించిన కేంద్రమంత్రులు, వీరితోపాటుగా శాశ్వత ఆహ్వానితులుగా మరికొంతమంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
అందులో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నియమించారు. వీరంతా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశాలకు హాజరుకావచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తో పాటుగా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూడా కొంత మంది కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి నియమించారు.