తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిని మార్చాలని గాంధీభవన్ ఎదుట కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు ధర్నాకు దిగారు. గత ఆగస్ట్ నెలలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని ఏఐసీసీ నియమించిన విషయం తెలిసిందే. దీనిని కొందరు విద్యార్థి విభాగం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వెంకటస్వామి ఆంధ్రకు చెందిన వ్యక్తి అని, తెలంగాణ విభాగం పదవులు లోకల్ వాళ్లకే దక్కాలని ఆరోపిస్తూ గతంలో సైతం నిరసనలు తెలిపారు.
మంగళవారం ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి తెలంగాణ పర్యటన ఉండటంతో మరోసారి ఆందోళనలు చేపట్టారు. ఎన్ఎస్యూఐలోని ఓ వర్గం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని గాంధీ భవన్ ఎదుట నిరసన తెలిపారు. ‘తెలంగాణ హక్కు.. తెలంగాణ యువతకే’.. ‘తెలంగాణ భవిష్యత్..తెలంగాణ చేతుల్లోనే’.. ‘తెలంగాణకు రాష్ట్ర నాయకత్వం..ఉద్యమ స్పూర్తికి నిజమైన గౌరవం’ అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిని వెంటనే మార్చి తెలంగాణకు చెందిన మరో వ్యక్తిని నియమించాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు.