నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రామస్థులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేస్తున్నట్లుగా సర్కార్ ప్రకటించగా..వెంటనే పనులను నిలిపివేయాలని కంపెనీ యాజమాన్యాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.ఇదిలాఉండగా,ఇథనాల్ ఫ్యాక్టరీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్‌కు వాటాలు ఉన్నాయంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
దీనిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం క్లారిటీ ఇచ్చారు. దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.ఆ కంపెనీ యాజమాన్యంలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని, ఎనిదేళ్ల కిందట తన కుమారుడు పీఎంకే కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడన్నారు. రాజమండ్రిలో కంపెనీని ఏర్పాటు కోసం నిర్ణయించినా అక్కడ కంపెనీ ఏర్పాటు రద్దు కావడంతో ఆ గ్రూప్ నుంచి తమ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమన్నారు.