తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల సానుకూల ధృక్పథంతో ఉన్నదని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తర్వలోనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆటో కార్మికులు తొందరపడి రాజకీయ పార్టీల ఉచ్చులో ఇరుక్కోవద్దని.. సమ్మెల బాట పడితే కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రి సూచించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ ఆటో & ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆటో కార్మికుల సమస్యలను జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆటో కార్మికులను తెలంగాణ ప్రజా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు.