తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. లగచర్ల రైతుకు బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు గులాబీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు.టూరిజం మీద చర్చించాల్సిన సమయం ఇది కాదని.. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో వేసేంత తప్పు ఆ రైతులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన సర్కార్..యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు.