సర్కార్ ఆదేశాలు బేఖాతర్.. భద్రాచలం నెయ్యి కాంట్రాక్టు ప్రైవేటుకే!

-

ప్రభుత్వ ఆదేశాలను భద్రాచలం ఆలయ అధికారులు బేఖాతర్ చేసినట్లు తెలుస్తోంది. లడ్డూ తయారీ కోసం అవసరమైన నెయ్యి కాంట్రాక్టును విజయ డైరీకి అప్పగించాలని ప్రభుత్వం సూచించగా.. అందుకు విరుద్దంగా ప్రైవేటుకు కేటాయించినట్లు సమాచారం. రూల్స్ మార్చి సీల్డ్ కవర్ విధానంలో ఈ-టెండర్లలో అనర్హత పొందిన సంస్థకే మరల కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలిసింది. విజయ డెయిరీని కాదని ఓ ప్రైవేటు డెయిరీకి నెయ్యి సరఫరా టెండర్‌ను కట్టబెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తొలుత పిలిచిన ఈ-టెండర్లలో ఆ డెయిరీ డిస్ క్వాలిఫై అయినట్లు విశ్వసనీయ సమాచారం.

ఏం పరిణామాలు జరిగాయో గానీ ఈ-టెండర్లను పక్కన పెట్టి సీల్డ్ కవర్ టెండర్లను పిలిచి ఎల్-1 పేరుతో సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.కాంట్రాక్టు గడువు ముగియడంతో జూన్‌లో అధికారులు నెయ్యి సరఫరాకు ఈ-టెండర్లు పిలిచారు. కరీంనగర్ డెయిరీతోపాటు ఏపీలోని జంగారెడ్డి గూడెం సమీపంలోని ‘రైతు డెయిరీ’ పాల్గొన్నాయి, కిలో నెయ్యికి కరీంనగర్ డెయిరీ జీఎస్టీతో కలిపి రూ.610, రైతు డెయిరీ రూ.534.24 కోట్ చేశాయి. రైతు డెయిరీ ఎల్- 1గా నిలిచింది. అయితే, ప్రధాన ఆలయాలకు రెండేళ్ల పాటు నెయ్యి సరఫరా చేసిన అనుభవం, ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవరు ఉండాలన్న టెండరు నిబంధనల్లో రైతు డెయిరీ అర్హత సాధించలేదు. దీంతో ఆలయ అధికారులు ‘డిస్‌క్వాలిఫై’ విషయాన్ని నోట్ ఫైల్లో రాయగా తర్వాత ఆ పేజీని చించినట్లు తెలిసింది.

ఆలయ ఉన్నతాధికారి ఒకరు ఈ-టెండర్‌ను రద్దు చేసి సీల్డ్ కవర్ టెండర్ పిలిచారు. టర్నోవరు, ప్రధాన ఆలయాలకు సరఫరా చేసిన అనుభవం నిబంధనల్ని తొలగించగా మళ్లీ అవే రెండు డెయిరీలు పాత ధరలే కోట్ చేశాయి.టీటీడీ లడ్డూల తయారీలో వాడిన నెయ్యి, టెండర్ల విషయం వివాదంగా మారడంతో ఆలయాలు ఇక నుంచి ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ నుంచే నెయ్యి తీసు కోవాలని ఆగస్టు 22న దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.రైతు డెయిరీకి నెయ్యి సరఫరా ఆర్డర్‌ను భద్రాచలం ఆలయ ఈఓ కార్యాలయం ఆగస్టు 28న జారీచేసింది. దీనికి ఆరురోజుల ముందే దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలిచ్చినా రైతు డెయిరీకి వర్క్ ఆర్డర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news