దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. నేటి నుంచే నామినేషన్లు సైతం స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 18న నామినేషన్ల పరిశీలన, 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని నోటిఫికేషన్లో పేర్కొంది.
ఫిబ్రవరి 5వ తేదీన 70అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఇక 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని వెల్లడించింది. ఇదిలాఉండగా, ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉండగా, వీరిలో 83.49 లక్షల మగ, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఐదోసారి ఓటింగ్లో పాల్గొంటున్న వారు 2.08 లక్షల మంది ఉన్నారు. ముఖ్యమైన యువ ఓటర్లు (20-29) సంఖ్య 25.89 లక్షలుగా ఉన్నట్లు ఈసీ తెలిపింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.