ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో అన్నదమ్ములు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానిక గొల్లపాలెంలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గొల్లపాలేనికి చెందిన అన్నదమ్ముల్లో ఒకరైన గంగాధర్‌కు అనుకోకుండా గుండెపోటు వచ్చింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అన్న గంగాధర్ మృతి చెందారు. ఈ విషయాన్ని వైద్యులు మృతుడి సోదరుడు అయిన గోపికి వివరిస్తుండగా అతనికి కూడా గుండెపోటు వచ్చింది.అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.వైద్యులు వెంటనే అతన్ని కూడా పరీక్షించగా తమ్ముడు కూడా మృతి చెందినట్లు నిర్దారించారు. అన్నదమ్ములు ఒకే రోజు మృతి చెందడంతో చీరాల గొల్లపాలెంలో విషాయ ఛాయలు అలుముకున్నాయి.