లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఇల్లందు పట్టణానికి చెందిన లోద్ సంతోష్ (21) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లోద్ సంతోష్ ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా రూ.90 వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు. నెలవారీగా కడుతూ రూ.48 వేల వరకు లోన్ క్లియర్ చేశాడని సమాచారం. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో తీసుకున్న రుణం కట్టకపోయాడు.
దీంతో యాప్ నిర్వాహకులు నిత్యం ఫోన్లు చేస్తూ వేధించడం మొదలుపెట్టారు. లోన్ కట్టకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి తెలిసిన వారందరికీ పంపుతామని బెదిరించినట్లు తెలిసింది.తన వల్ల కుటుంబం పరువు పోతుందనే బాధతో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అతని పరిస్థితి విషమించగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. తీరా అక్కడకు వెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.