రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం పున: సమీక్ష చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సంక్షేమం పై జరిగిన సమీక్ష సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలో సగం కట్టి ఆగిపోయిన ఇళ్లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.
అంతేకాదు.. రేషన్ కార్డుల విషయంలో నిజామాబాద్ లో మీసేవ ద్వారానే దాదాపు లక్ష 27వేల దరఖాస్తులు వచ్చాయని.. వీటిని పక్కన పెట్టి కులగణనను ఆధారంగా చేసుకొని కేవలం 26 వేల మందిని మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం అన్యాయం అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా వచ్చిన రేషన్ కార్డుల అప్లికేషన్ల వివరాలను బహిర్గత పరచాలని కోరారు. రేషన్ కార్డుల ఆదాయ పరిమితిని మరోసారి సవరణ చేయాలని.. ప్రభుత్వ నిర్ణయం పై సమీక్ష చేసుకోవాలని సూచించారు.