భర్త దొంగతనాలు మానడం లేదని ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను సైతం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ.. మౌనిక పక్క సీట్లో కూర్చున్నాడు. దీంతో వారిమధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
తల్లితండ్రులను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న మౌనిక.. తన భర్త తీరుతో విసుగుచెందింది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కూతుర్లు ఉన్నారు.పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ..నిజానికి పలుచోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తర్వాత తెలిసింది.
చోరీలు మానేయాలని భర్తకు పలుమార్లు నచ్చజెప్పింది.అయినా అతడిలో మార్పు రాలేదు.తాజాగా ఓ దొంగతనం కేసులో భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానంతో ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసి తానూ ఆత్మహత్య చేసుకుంది.