ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. వారంతా విజయవాడలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇటీవల కనిపించకుండాపోయారు. వీరంతా పదవ తరగతి వీడ్కోలు సమావేశానికి వెళ్లారు.
అక్కడ కొందరు విద్యార్థులు మద్యం సేవించి తోటి విద్యార్థులతో గొడవ పడ్డారు. దీంతో వారిని టీచర్లు మందలించగా మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థులు స్కూల్ నుంచి పారిపోయారు . భయాందోళనకు గురైన టీచర్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పట్టణంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులు విజయవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి భాను ప్రకాశ్, నాగ వంశీ, వికాస్, జగన్, యువరాజ్, అజయ్‌లను తీసుకొచ్చారు.అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాల ఉపాధ్యాయులకు అప్పగించారు.