ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కానూరు ఎన్ఆర్ఐ కాలేజీలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణునాథ్(18) ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
నేడు హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో తోటి విద్యార్థుల సమాచారంతో కాలేజీ యాజమాన్యం మృతుడి పేరెంట్స్‌కు సమాచారం అందించింది. చేతికొచ్చిన కొడుకును విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రేమ వ్యవహారమే వేణునాథ్ ఆత్మహత్యకు కారణమని ఎన్ఆర్ఐ సిబ్బంది చెబుతున్నారు.దానికి సంబంధించి సూసైడ్ నోట్ దొరికిందని వెల్లడించారు. అయితే, ఆ నోట్‌లోని హ్యాండ్ రైటింగ్ తమ కొడుకుది కాదని వేణునాథ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.